చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు.. కొనుగోళ్లు లేక కార్మికుల ఆవేదన

May 28, 2026 - 19:37
 0  81
చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు.. కొనుగోళ్లు లేక కార్మికుల ఆవేదన

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న వస్త్రాలకు ఈ ఏడాది జనవరి నెల నుంచి సరైన ప్రోక్యుర్మెంట్ లేకపోవడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయని తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రభుత్వం చేనేత జౌళి శాఖ కమిషనర్‌, టెస్కో మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

డిసెంబర్ నెల వరకు రావలసిన చెల్లింపులు ఇంకా అనేక సంఘాలకు అందలేదని, ఆర్‌డీ-2 ఖాతాలకు సంబంధించిన నిధులు గత 12 నెలలుగా బ్యాంకుల్లో జమ కాలేదని ఆయన తెలిపారు. అలాగే నేత కార్మికులకు అందాల్సిన నూలు సబ్సిడీ ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీ పాలిస్టర్ స్కూల్ యూనిఫాం క్లాత్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

చేనేత సహకార సంఘాలకు ప్రైవేట్ మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ రంగ సంస్థలపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. టెస్కో సంస్థ సంఘాల వద్ద తయారయ్యే వస్త్రాలను వెంటనే కొనుగోలు చేసి, తక్షణ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధానంలోనే ప్రతి చేనేత వస్త్రాన్ని కూడా “క్యాష్ అండ్ క్యారీ” పద్ధతిలో కొనుగోలు చేయాలని కోరారు.

రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రస్తుతం పర్సన్ ఇన్‌చార్జ్ పాలన కొనసాగుతోందని, దీంతో సంఘాలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని విమర్శించారు. టెస్కో పాలక మండలి లేకపోవడం, షోరూమ్‌ల కొరత, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

చేనేత కార్మికుల దుస్థితిపై ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, చేనేత సంఘాలను నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని రాపోలు వీర మోహన్ విజ్ఞప్తి చేశారు।

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
RNI News Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.